ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. హరితా రెడ్డి, రాయచోటి పోలీసులు తనకు ఎస్కార్టుగా రావాలని ఆదేశించగా, వారు నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో హరితా రెడ్డి పోలీసులతో చాలా దురుసుగా ప్రవర్తించారని విమర్శలు వచ్చాయి.
ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి, రామ్ ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి వివరణ కోరారు. మంత్రి పదవి వచ్చిన నెల రోజులు కూడా కాకుండానే ఇలాంటి వివాదాలు జరగడం సరికాదని అన్నారు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఈ విషయంలో తన భార్య హరితా రెడ్డి ప్రవర్తన బాధాకరమని, ఆమె ప్రవర్తనకు క్షమాపణలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా మంత్రులు, వారి కుటుంబ సభ్యులు నిర్దేశిత నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.