ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెరిగిన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎవరెవరికి ఎంత పెన్షన్ వస్తోంది, అర్హులై ఉండి పెన్షన్ పొందని వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాలు ఇక్కడ పొందుపరిచాం.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 వేలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని కొత్త ప్రభుత్వం 4 వేలు చేసింది. జూలై 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేతి వృత్తిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. చాలా మందికి అర్హత ఉన్నా పెన్షన్ పొందలేదు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్లకు వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, చెప్పులు కుట్టేవారు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, హెచ్ఐవీ బాధితులు, డ్రమ్మర్లు, మత్స్యకారులు, చేతి వృత్తులవారు అర్హులు. సాధారణ లబ్ధిదారులకు నెలకు 4 వేలు, వికలాంగులకు నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వనున్నారు. పూర్తిగా వికలాంగులైనవారికి నెలకు 15 వేలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు 10 వేలు పెన్షన్ అందుతుంది.
పెన్షన్ కోసం ఇలా అప్లై చేయండి:
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లకు అర్హులై ఉండి పెన్షన్ రాకుండా ఉంటే ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ అధికారిక పోర్టల్ SSPensions ఓపెన్ చేయాలి. ఈ పోర్టల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫామ్లో మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ ఇతర వివరాలు నమోదు చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు వంటి పత్రాలు జత చేసి దరఖాస్తును గ్రామ పంచాయితీ కార్యాలయంలో సమర్పించాలి.
ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలంటే:
ఈ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. దీనికోసం మీ పేరు, పాస్వర్డ్ వివరాలు నమోదు చేయాలి. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఆ తరువాత ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.